ఇంట్లో నిద్రిస్తున్న వారిని తొక్కి చంపిన ఏనుగులు.. నలుగురి మృతి

రాష్ట్రంలో ఏనుగులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బరగఢ్‌ జిల్లా పద్మపూర్‌ సబ్‌డివిజన్‌ కేంద్రంలో ఆదివారం రాత్రి ఓ బాలుడు సహా నలుగురిని ఏనుగులు తొక్కి చంపేశాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పద్మపూర్‌ గ్రామంలోని ఒకటో నెంబర్‌ వార్డు శివారులోని ఓ ఇంటిలో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు వచ్చి దాడి చేసింది. ఇంటి పైకప్పు, గోడలు, సామగ్రి ధ్వంసం చేశాయి.ఈ దాడిలో ఇంట్లో నిద్రిస్తున్న ద్వారకనాథ్‌ పాండే(75), పక్కన పొలంలో ఉన్న ఆయన కుమారుడు మలయో పాండే(45), మనువడు చింటు పాండే(7) ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో బుడెన్‌ పీఎస్ పరిధి భోజెన్‌ముండా గ్రామంలో హేమసాగర్‌ సాహు(50) కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లగా అక్కడ ఏనుగు దాడి చేసి చంపేసింది. ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను పద్మపూర్‌ సబ్‌డివిజనల్‌ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రెండు ఘటనల్లోనూ వేర్వేరు ఏనుగులు దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏనుగుల గుంపు మనుషుల ప్రాణాలు తీస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.